Ind vs WI: మూడోరోజే ముగించేశారు విండీస్ పై భారత్ ఇన్నింగ్స్ విక్టరీ
Ind vs WI: జడేజాతో పాటు కుల్దీప్, వాషింగ్టన్ సుందర్ కూడా స్పిన్ మ్యాజిక్ చూపించారు. అటు చివర్లో మహ్మద్ సిరాజ్ కూడా తన పేస్ తో విండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.

Ind vs WI
అహ్మదాబాద్ టెస్టు(Ind vs WI)లో ఊహించిన ఫలితమే వచ్చింది. వెస్టిండీస్ జట్టు ఘోరంగా విఫలమైన వేళ తొలి టెస్టులో భారత జట్టు ఘనవిజయాన్ని అందుకుంది. కేవలం మూడురోజుల్లోనే మ్యాచ్ ను ముగించేసింది. ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్ ను చిత్తు చిత్తుగా ఓడించింది. గంభీర్ వ్యూహంతో మూడోరోజు బ్యాటింగ్ కు దిగకుండా ఓవర్ నైట్ స్కోర్ 448/5 దగ్గరే డిక్లేర్ చేసింది. దీంతో 286 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ అట్టర్ ఫ్లాప్ అయింది. తొలి ఇన్నింగ్స్ తరహాలోనే ఆ జట్టు బ్యాటర్లు సమిష్టిగా చేతులెత్తేశారు.
అంచనాలు పెట్టుకున్న ఏ ఒక్క బ్యాటర్ కూడా క్రీజులో నిలవలేదు. పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుండడంతో రవీంద్ర జడేజా చెలరేగిపోయాడు. అతనాజే 38, గ్రీవ్స్ 25 తప్పిస్తే మిగిలిన బ్యాటర్లంతా ఫ్లాప్ అయ్యారు. లంచ్ లోపే విండీస్ సగం జట్టు పెవిలియన్ కు చేరిపోయింది.

భారత్ పిచ్ లపై ఆడిన అనుభవం లేకపోవడంతో కరేబియన్ యువ ఆటగాళ్ళు మన బౌలర్లను ఎదుర్కోలేక పెవిలియన్ కు క్యూ కట్టారు. జడేజాతో పాటు కుల్దీప్, వాషింగ్టన్ సుందర్ కూడా స్పిన్ మ్యాజిక్ చూపించారు. అటు చివర్లో మహ్మద్ సిరాజ్ కూడా తన పేస్ తో విండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. దీంతో రెండో ఇన్నింగ్స్ లో కరేబియన్ జట్టు కేవలం 146 పరుగులకే కుప్పకూలింది. చివర్లో టెయిలెండర్లు లేన్, సీల్స్ ధాటిగా ఆడడంతో స్కోర్ 100 దాటగలిగింది. జడేజా 4 వికెట్లు తీసుకోగా…సిరాజ్ 3 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ 2 , వాషింగ్టన్ సుందర్ కు ఒక వికెట్ దక్కింది.

భారత్ తొలి ఇన్నింగ్స్ లో 448 పరుగుల భారీస్కోర్ చేసింది. ముగ్గురు బ్యాటర్లు శతకాలు బాదారు. కెఎల్ రాహుల్ తన సూపర్ ఫామ్ ను కంటిన్యూ చేస్తూ 100 రన్స్ చేయగా… జురెల్, జడేజా కూడా సెంచరీలు కొట్టారు. కెప్టెన్ గిల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. విండీస్ బౌలర్లు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఈ(Ind vs WI) మ్యాచ్ లో ఏ దశలోనూ విండీస్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది.
సీనియర్ ప్లేయర్లు పెద్దగా లేకపోవడం విండీస్ ఘోరపరాజయానికి కారణంగా చెప్పొచ్చు. కాగా ఇన్నింగ్స్ 140 రన్స్ తేడాతో గెలిచిన భారత్ కు డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్ లో ఇది మూడో విజయం. ఇంగ్లాండ్ గడ్డపై భారత్ రెండు టెస్టులు గెలిచింది. ఇదిలా ఉంటే ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్ లో రెండో టెస్ట్ న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా అక్టోబర్ 10 నుంచి మొదలవుతుంది.