Kalyan Padala:బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల .. సామాన్యుడి విజయం వెనుక అసలు రహస్యం ఇదే
Kalyan Padala: న్నో మలుపులు, గొడవలు, ఎమోషన్ల మధ్య సాగిన ఈ రియాలిటీ షోలో చివరకు అందరి అంచనాలను నిజం చేస్తూ సామాన్యుడి కోటాలో హౌస్‌లోకి అడుగుపెట్టిన కళ్యాణ్ పడాల విజేతగా నిలిచాడు.
Kalyan Padala
తెలుగు బుల్లితెరపై 105 రోజులుగా ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ సీజన్ 9 ఘనంగా ముగిసింది. ఎన్నో మలుపులు, గొడవలు, ఎమోషన్ల మధ్య సాగిన ఈ రియాలిటీ షోలో చివరకు అందరి అంచనాలను నిజం చేస్తూ సామాన్యుడి కోటాలో హౌస్‌లోకి అడుగుపెట్టిన కళ్యాణ్ పడాల (Kalyan Padala)విజేతగా నిలిచాడు.
ఆదివారం రాత్రి జరిగిన గ్రాండ్ ఫినాలేలో హోస్ట్ నాగార్జున కళ్యాణ్ (Kalyan Padala)చేయి పైకెత్తి బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విజేతగా ప్రకటించారు. దీంతో విజయనగరం జిల్లాకు చెందిన ఒక మధ్యతరగతి యువకుడు, భారత ఆర్మీ అధికారి అయిన కళ్యాణ్ పడాల తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాడు.
గ్రాండ్ ఫినాలే పోరు ఐదుగురు కంటెస్టెంట్లతో ప్రారంభమైంది. ఇందులో ముందుగా సంజన గల్రానీ టాప్ 5 స్థానంతో సరిపెట్టుకుని హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఆమె తర్వాత జబర్దస్త్ ఫేమ్ ఇమ్మాన్యుయేల్ టాప్ 4 స్థానంలో ఎలిమినేట్ అయ్యాడు. ఇక అసలైన ఉత్కంఠ టాప్ 3 కంటెస్టెంట్ల మధ్య మొదలైంది.
కళ్యాణ్ పడాల(Kalyan Padala), తనూజ , డిమాన్ పవన్ టాప్ 3 లో నిలిచారు. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన మలుపు చోటు చేసుకుంది. తన గెలుపు అవకాశాలను అంచనా వేసుకున్న డిమాన్ పవన్, బిగ్ బాస్ ఆఫర్ చేసిన 15 లక్షల రూపాయల సూట్‌కేస్‌ను తీసుకుని రేసు నుంచి తప్పుకున్నాడు. పవన్ తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచినా, ఆర్థికంగా అతనికి ఇది మంచి నిర్ణయం అని నెటిజన్లు భావిస్తున్నారు.

విజయనగరం జిల్లాకు చెందిన కళ్యాణ్ పడాల ఒక ఆర్మీ ఆఫీసర్. షో ఆరంభంలో తనూజ వెనకే తిరుగుతూ లవర్ బాయ్ లా కనిపించిన కళ్యాణ్, మెల్లిగా తన ఆట తీరును మార్చుకున్నాడు. తనూజతో ఉన్న రిలేషన్‌ను ఒక ఎమోషనల్ సెంటిమెంట్‌గా మార్చుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా గ్రాండ్ ఫినాలేకు ముందు జరిగిన టాస్క్‌లో కళ్యాణ్ గాయపడటం అతనికి పెద్ద ప్లస్ అయ్యింది. ఆ గాయం పట్ల ప్రేక్షకులు చూపిన సానుభూతి భారీగా ఓట్ల రూపంలో కురిసింది. సాధారణంగా సెలబ్రిటీల మధ్య సామాన్యులకు ఓట్లు పడటం కష్టం కానీ కళ్యాణ్ విషయంలో అది రివర్స్ అయ్యింది.
తనూజ విజేతగా నిలుస్తుందని చాలా మంది భావించినా.. ఆమె రన్నరప్‌గా మాత్రమే నిలిచింది. ఫైనల్ సమయంలో తనూజ అభిమానులు , కళ్యాణ్ అభిమానుల మధ్య ఓట్లు చీలిపోయాయి. అయితే ఈ సమయంలో తనూజ పీఆర్ టీమ్ పై కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. తనూజ పీఆర్ టీమ్ సోషల్ మీడియా ద్వారా ప్రజలను ప్రభావితం చేస్తోందని హౌస్ లోని కొందరు సెలబ్రిటీలే కామెంట్ చేయడం కళ్యాణ్ కు మరింత కలిసి వచ్చింది. సెలబ్రిటీలు పీఆర్ టీమ్స్ తో ఆడుతుంటే, సామాన్యుడైన కళ్యాణ్ ఒంటరిగా పోరాడుతున్నాడనే భావన జనాల్లోకి వెళ్లింది. ఇదే అతనికి భారీ మెజారిటీని తెచ్చిపెట్టింది.
ఒక ఆర్మీ ఆఫీసర్‌గా దేశానికి సేవ చేస్తున్న కళ్యాణ్ పడాల, ఇప్పుడు బిగ్ బాస్ విజేతగా తెలుగు ప్రజల మనసు గెలుచుకున్నాడు. సామాన్యులకు కూడా ఈ వేదికపై గుర్తింపు దక్కుతుందని ఆయన నిరూపించాడు. కళ్యాణ్ పడాల గెలుపుతో విజయనగరం జిల్లాలో పండగ వాతావరణం నెలకొంది. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 9 ఒక సామాన్యుడిని సెలబ్రిటీగా మార్చి శుభం కార్డు వేసుకుంది.



