Carona Virus : ఏపీలో నలుగురు మృతి.. కొత్త వేరియంట్‌తో కరోనా సెకండ్ ఇన్నింగ్స్?
Carona Virus : ఏపీలో జూన్ 26 నుంచి జూలై 16 వరకు నాలుగు జిల్లాల్లో మొత్తం 12 కోవిడ్ కేసులు వెలుగు చూసినట్లు అధికారులు చెప్పారు.
Carona Virus
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి మెల్లగా పడగ విప్పుతోంది. ముఖ్యంగా సౌత్ ఇండియాలోని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా కొత్త కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతుండటం టెన్షన్ పుట్టిస్తోంది. అంతేకాదు ఏపీలో కోవిడ్ లక్షణాలతో నలుగురు ప్రాణాలు కోల్పోవడం ఇంకా ఆందోళన కలిగిస్తోంది.
అయితే కరోనా(Carona Virus )లక్షణాలతో ఇప్పుడు చనిపోయిన వారంతా ఇదివరకే తీవ్రమైన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారే అని అధికారులు స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీలతో పాటు ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్లు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.
ఇక ఏపీలో జూన్ 26 నుంచి జూలై 16 వరకు నాలుగు జిల్లాల్లో మొత్తం 12 కోవిడ్ కేసులు వెలుగు చూసినట్లు అధికారులు చెప్పారు. ఈ వైరస్ తీవ్రతను తెలుసుకోవడానికి సేకరించిన శాంపిళ్లను పుణేలోని ల్యాబ్‌కు పంపించగా.. అక్కడే షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్నది ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన ‘ఆర్ఎఫ్.5’ (RF.5) అని ఈ పరీక్షల్లో తేలింది.
సింగపూర్, ఆగ్నేయాసియా దేశాల్లో ఇప్పటికే RF.5 వేరియంట్ కేసులు భారీగానే నమోదవుతున్నాయి. అయితే ఇది అంత ప్రమాదకరమైనది కాదని, వైరస్ ప్రస్తుతం ఎండెమిక్ అంటే సాధారణ స్థాయి దశలోనే ఉండటం వల్ల తీవ్రత తక్కువగానే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
మరోవైపు పొరుగు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నా.. తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి కరోనా(Carona Virus) కొత్త కేసులు నమోదు కాలేదు. ఒకవేళ కేసులు పెరిగినా ఎదుర్కోవడానికి హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
అయితే కోవిడ్ పరిస్థితులను ఫేస్ చేయడానికి అందరూ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహం, ఆస్తమా, సీవోపీడీ అంటే ఊపిరితిత్తుల వ్యాధి, క్యాన్సర్ పేషెంట్లతో పాటు , రెగ్యులర్‌గా స్టెరాయిడ్లు వాడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. గుంపులుగా ఉండే ప్రదేశాలకు వెళ్లినప్పుడు కచ్చితంగా మాస్క్ ధరించాలి.
చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవడంతో పాటు, అనవసర ప్రయాణాలను ఇప్పుడు వాయిదా వేసుకోవడమే మంచిది. వృద్ధులు, పిల్లలు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండటానికి ముందుగానే ఫ్లూ, న్యూమోకోకల్ వ్యాక్సిన్లను తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి రోజూ 30 నిమిషాల పాటు యోగా లేదా వ్యాయామం చేయడం అలవాటుగా మార్చుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. అలాగే తగినంత నిద్రపోవడం, ఎక్కువ నీళ్లు తాగడం , పౌష్టికాహారం తీసుకోవడం చాలా అవసరం.
ఒకవేళ మీకు కానీ ఇంట్లో ఎవరికైనా కానీ తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, కడుపు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అన్పించినా..లేక ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నట్లు అనిపించినా వెంటనే హాస్పిటల్‌కు వెళ్లడం మంచిది.
PV Sindhu : జపాన్ గడ్డపై సింధు జైత్రయాత్ర..ఫైనల్లో యమగుచికి చుక్కలు చూపించిన గోల్డెన్ గర్ల్





