Varun Tej:మెగా వారసుడు వచ్చేశాడు.. వరుణ్ తేజ్, లావణ్యల పండంటి బిడ్డ!
Varun Tej:బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని రెయిన్బో ఆసుపత్రిలో లావణ్య ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.

Varun Tej
మెగా కుటుంబంలో ఆనందానికి అవధుల్లేవు! మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి జంట తమ జీవితంలో అత్యంత విలువైన క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని రెయిన్బో ఆసుపత్రిలో లావణ్య ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో, అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సోషల్ మీడియాలో ఈ శుభవార్త తుఫానులా వ్యాపించింది.

కొత్తతరం వారసుడు రాకతో మెగా ఫ్యామిలీలో సంతోషం ఉప్పొంగుతోంది. మెగాస్టార్ చిరంజీవి, తన ‘మన శంకరవరప్రసాద్ గారు’ షూటింగ్ సెట్స్ నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లి కొత్త తల్లిదండ్రులను పరామర్శించారు. చిరంజీవి ఆనందంగా బాబును ఎత్తుకుని ఫోటోలకు ఫోజులివ్వడంతో అది కాస్తా ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

2017లో ‘మిస్టర్’ సినిమా షూటింగ్లో మొదలైన వరుణ్, లావణ్యల స్నేహం, ఆ తర్వాత ప్రేమగా మారి, 2023 మే నెలలో తమ రిలేషన్‌షిప్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు. నవంబర్ 1న ఇటలీలోని టస్కానీలో జరిగిన అత్యంత అద్భుతమైన డెస్టినేషన్ వెడ్డింగ్‌లో వీరు ఒక్కటయ్యారు. ఇప్పుడు ఈ జంట తమ ప్రేమకు గుర్తుగా, ఒక బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. తల్లీబిడ్డలు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ధృవీకరించారు.

సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, అభిమానులు ఈ జంటకు, కొత్తగా వచ్చిన మెగా వారసుడికి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. కొత్తగా తల్లిదండ్రులైన వరుణ్, లావణ్య ప్రస్తుతం ఈ మధుర క్షణాలను ఆస్వాదిస్తున్నారు.