Diabetes: డయాబెటిస్‌ను ప్రారంభంలోనే గుర్తిస్తే పెద్ద ప్రమాదం తప్పినట్లే
Diabetes: డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకోకపోతే ఏం జరుగుతుంది, దాని లక్షణాలు, రకాలు, నియంత్రణ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Diabetes
భారతదేశం ‘షుగర్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్’గా మారుతున్న రోజులు ఇవి. జీవనశైలిలో వచ్చిన మార్పులు, సమయపాలన లేని అలవాట్లు, పని ఒత్తిడి కారణంగా డయాబెటిస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా షుగర్ రోగులు సరైన సమయంలో మందులు వేసుకోకపోవడం, ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పి అనేక ప్రమాదకర సమస్యలకు దారితీస్తున్నాయి. డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకోకపోతే ఏం జరుగుతుంది, దాని లక్షణాలు, రకాలు, నియంత్రణ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పితే, ఆ ప్రభావం శరీరంలోని అన్ని అవయవాలపైనా పడుతుంది. ఇది నెమ్మదిగా మన శరీరంలోని వ్యవస్థలను దెబ్బతీస్తుంది. తీవ్రమైన ఇన్ఫెక్షన్లు తలెత్తడం, చూపు కోల్పోవడం, కిడ్నీలు ఫెయిల్ కావడం, గుండెపోటు వంటి ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, చక్కెర స్థాయిలు అదుపులో లేకపోతే ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకే డయాబెటిస్ రోగులు తమ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

డయాబెటిస్(Diabetes)ను కొన్ని ప్రాథమిక లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. మీరు తరచుగా అతిగా దాహం వేయడం, అతిగా ఆకలి వేయడం, అస్పష్టమైన కంటి చూపు, చిన్న పనికే త్వరగా అలసిపోవడం, ఏకాగ్రత లేకపోవడం వంటి లక్షణాలను గమనించినట్లయితే, అది డయాబెటిస్ కావచ్చు. అంతేకాకుండా, గాయం తగిలితే తొందరగా తగ్గకపోవడం కూడా ఒక లక్షణమే. మీలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
డయాబెటిస్(Diabetes)లో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. టైప్-1 డయాబెటిస్.. ఇది ఎక్కువగా జన్యుపరంగా, అంటే వంశపారంపర్యంగా వస్తుంది. క్లోమ గ్రంథి (ప్యాంక్రియాస్) ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయడంలో విఫలమైనప్పుడు ఇది సంభవిస్తుంది.
టైప్-2 డయాబెటిస్(Diabetes).. ప్రస్తుత ప్రపంచంలో ఎక్కువమందిని ప్రభావితం చేస్తున్నది ఇదే. దీనికి ప్రధాన కారణాలు సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, అధిక బరువు, మానసిక ఒత్తిడి , ఆందోళనలు.కారణం ఏదైనా, డయాబెటిస్ మన దరికి రాకుండా చూసుకోవడమే ఉత్తమం. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం, సరైన ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం ద్వారా ఈ వ్యాధి బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.
2 Comments