Solar Eclipse:ఈరోజే సూర్యగ్రహణం.. భారత్‌లో ప్రభావం లేకపోయినా జాగ్రత్తలు ఎందుకు?
Solar Eclipse: భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:26 నిమిషాలకు సూర్య గ్రహణం ప్రారంభం అవుతుంది.
Solar Eclipse
ఈరోజు అంటే ఫిబ్రవరి 17న మాఘ మాస అమావాస్య పుణ్యకాలంలో.. కుంభ రాశి, ధనిష్ఠ నక్షత్రంలో రాహుగ్రస్త సూర్యగ్రహణం(Solar Eclipse) ఏర్పడుతుంది. అయితే గ్రహణం భారతదేశంలో ఎక్కడా కనిపించదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. శాస్త్రం ప్రకారం చూస్తే.. ఎక్కడైతే గ్రహణం కంటికి కనిపిస్తుందో, అక్కడ మాత్రమే గ్రహణ నియమాలు, పట్టు విడుపు కాలాలు, దోషాలు వంటివి వర్తిస్తాయి.
భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:26 నిమిషాలకు సూర్య గ్రహణం(Solar Eclipse) ప్రారంభం అవుతుంది. సాయంత్రం 5:42 నిమిషాలకు గ్రహణం మధ్య కాలం అంటే గరిష్ట గ్రహణం ఉంటుంది. రాత్రి 8:12 నిమిషాలకు గ్రహణం ముగుస్తుంది. మొత్తం మీద ఈ ఖగోళ ప్రక్రియ దాదాపు 4 గంటల 46 నిమిషాల పాటు సాగుతుంది.
భారత దేశంలో గ్రహణం కనిపించదు కాబట్టి దేవాలయాలు ఎప్పటిలాగే తెరిచే ఉంటాయి. మనం నిత్యం చేసే పనులకు కూడా ఎటువంటి ఆటంకం లేదు. అయినా కూడా భారత్ లో ప్రభావం లేకపోయినా బయట తిరగొద్దని , ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు కొంతమంది పండితులు. దీనిని శాస్త్రం ప్రకారం ,సైన్స్ పరంగా రెండు రకాలుగా చూడొచ్చంటున్నారు.
శాస్త్రం ప్రకారం చూస్తే భూమి ఒక ఆవరణలోనే ఉంటుంది. గ్రహణం ఒక దేశంలో కనిపించి మరో దేశంలో కనిపించకపోయినా, ఆ సమయంలో గ్రహగతుల మార్పుల వల్ల..అనంత విశ్వంలో ఒకేసారి ఒకే రకమైన శక్తి మార్పులు జరుగుతాయని నమ్ముతారు. కుంభ రాశిలో ఐదు గ్రహాలు కలిసి ఉండటం అంటే పంచగ్రహ కూటమి వల్ల వాతావరణంలో లేదా మానసిక స్థితిగతుల్లో స్వల్ప మార్పులు వచ్చే అవకాశం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.ఇది కేవలం ఆధ్యాత్మిక నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది.

ఇక సైన్స్ పరంగా చూస్తే, సూర్యగ్రహణం అనేది భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చే ఒక ఖగోళ ప్రక్రియ అని మనకందరికీ తెలిసిందే. గ్రహణం కనిపించే దేశాల్లో సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన అతినీలలోహిత (UV) కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే భారత్‌లో ఈ గ్రహణం కనిపించదు కాబట్టి నేరుగా అటువంటి కిరణాల ముప్పు మనకెవరకీ ఉండదు.
అయితే, గ్రహణ సమయంలో భూమి అయస్కాంత క్షేత్రంలో (Magnetic Field) కొన్ని మార్పులు జరుగుతాయని కొన్ని శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల పక్షులు, జంతువుల ప్రవర్తనలో మార్పులు రావొచ్చని చెబుతాయి. మనం బయట తిరగకూడదు అనడానికి శాస్త్రీయంగా బలమైన కారణం లేదు.
ముగింపుగా చెప్పాలంటే, భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు కాబట్టి ఎటువంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు. శాస్త్రాన్ని గౌరవిస్తూనే, సైన్స్ చెప్పే నిజాలను గ్రహించడం వల్ల ఇటువంటి ఖగోళ అద్భుతాలను మనం ప్రశాంతంగా గమనించొచ్చు.



