India :వేటు పడేది ఎవరిపై ?..తుది జట్టులో మార్పులు ఖాయం
India : టీ20 ప్రపంచకప్ లో ఒక్క ఓటమితో భారత్ బొమ్మ తలకిందులైంది. టైటిల్ ఫేవరెట్.. తిరుగులేదు.. కప్ మనదే అనుకుంటున్న వేళ సౌతాఫ్రికాతో పరాజయం గట్టి దెబ్బ కొట్టింది
India
టీ20 ప్రపంచకప్ లో ఒక్క ఓటమితో భారత్(India) బొమ్మ తలకిందులైంది. టైటిల్ ఫేవరెట్.. తిరుగులేదు.. కప్ మనదే అనుకుంటున్న వేళ సౌతాఫ్రికాతో పరాజయం గట్టి దెబ్బ కొట్టింది. సహజంగానే ఓటమి ఎదురైన తర్వాత జట్టు లోపాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ లోపాలను అధిగమించడంపైనే టీమిండియా ఫోకస్ పెట్టింది.
పనిలో పనిగా తుది జట్టు కూర్పులోనూ కీలక మార్పులకు సిద్ధమైంది. ఎందుకంటే మిగిలిన రెండు మ్యాచ్ లలోనూ భారత్ (India)మంచి రన్ రేట్ తో గెలిస్తేనే సెమీస్ రేసులో ఉంటుంది. అందుకే తుది జట్టు ఎంపికలో సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓపెనింగ్ కాంబినేషన్ మారడం ఖాయమని భావిస్తున్నారు. వరుస వైఫల్యాలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న అభిషేక్ శర్మను తప్పించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
ఒకటి రెండు ఫెయిల్యూర్స్ కే సంజూ శాంసన్ ను తప్పించిన విషయాన్ని క్రికెట్ అభిమానులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు జింబాబ్వేతో మ్యాచ్ కు అభిషేక్ ను తప్పించి సంజూ శాంసన్ ను తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై భారత అసిస్టెంట్ కోచ్ కూడా స్పందించాడు. సంజూను తుది జట్టులోకి తీసుకునే విషయంలో చర్చిస్తామని చెప్పాడు. అలాగే తిలక్ వర్మ పేలవ ఫామ్ కూడా ఆందోళన కలిగిస్తోంది. తర్వాతి మ్యాచ్ లోనైనా తిలక్ ఫామ్ అందుకోకుంటే ఇబ్బందులు తప్పవు.

మరోవైపు తుది జట్టు నుంచి అక్షర్ పటేల్ ను ఎందుకు తప్పిస్తున్నారనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వాషింగ్టన్ సుందర్ కంటే ఆల్ రౌండర్ గా అక్షర్ మంచి ప్లేయర్ అనేది అందరికీ తెలుసు. అలాంటప్పుడు మెగాటోర్నీ మధ్యలో అది కూడా కీలకమైన సూపర్ 8లో ప్రయోగాలు ఎందుకు చేస్తున్నారనేది చర్చకు దారితీసింది.
ఈ సమయంలో జింబాబ్వేతో మ్యాచ్ కు అక్షర్ పటేల్ తుది జట్టులోకి రావడం ఖాయం. ఈ రెండు మార్పులు తప్పిస్తే మిగిలిన జట్టు ఎప్పటిలాగే ఉంటుందని భావిస్తున్నారు. అయితే ప్రధాన బ్యాటర్లందరూ పూర్తి ఫామ్ లోకి రావాల్సిన అవసరం ఉంది. ఇషాన్ కిషన్ , తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ రాణించకుంటే విజయంపై ఆశలు పెట్టుకోలేం. ముఖ్యంగా రింకూ సింగ్ వరుస వైఫల్యాలు కూడా జట్టు ఓటమికి కారణంగా చెప్పొచ్చు. ఫినిషర్ రోల్ లో అదరగొడతాడనుకుంటే రింకూ తనకిచ్చిన అవకాశాలను వృథా చేసుకుంటున్నాడు.



