India Semifinal : భారత్ కొంపముంచిన విండీస్..సెమీస్ అవకాశాలు గల్లంతు ?
India Semifinal : అత్యంత బలంగా ఉన్న భారత జట్టుకు ఈ పరిస్థితి వస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. సూపర్ 8 తొలి మ్యాచ్ లో సౌతాఫ్రికాపై ఘోరపరాజయం సెమీఫైనల్ అవకాశాలను ఒక్కసారిగా సంక్లిష్టంగా మార్చేసింది
India Semifinal
వరల్డ్ కప్ లాంటి మెగాటోర్నీలో మనం సాధించిన విజయాలే మనల్ని ముందుకు తీసుకెళతాయి. ఒక్కసారి విజయాలకు బ్రేక్ పడిందా ఇక మిగిలిన జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సిందే. ఏవో చిన్న జట్లు, నిలకడగా రాణించని లాంటి జట్లకు ఇలాంటి పరిస్థితి వస్తే ఓకే.. కానీ టైటిల్ ఫేవరెట్.. అది కూడా హోం టీమ్.. అత్యంత బలంగా ఉన్న భారత జట్టుకు ఈ పరిస్థితి వస్తుందని ఎవ్వరూ అనుకోలేదు.
సూపర్ 8 తొలి మ్యాచ్ లో సౌతాఫ్రికాపై ఘోరపరాజయం సెమీఫైనల్ అవకాశాలను ఒక్కసారిగా సంక్లిష్టంగా మార్చేసింది. ఏదో తక్కువ మార్జిన్ తో ఓడిపోయి ఉంటే అంత ఇబ్బంది ఉండేది కాదు. ఏకంగా 76 పరుగుల తేడాతో పరాజయం పాలవడం రన్ రేట్ ను బాగా దెబ్బకొట్టింది. తాజాగా జింబాబ్వేపై వెస్టిండీస్ సాధించిన భారీ విజయంతో ఇప్పుడు భారత్ సెమీస్(India Semifinal) అవకాశాలు మరింత క్లిష్టంగా మారిపోయాయి.
ఎందుకంటే సూపర్ 8 గ్రూప్ లో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లే ముందంజ వేస్తాయి. ఒకవేళ ఇరు జట్ల పాయింట్లు సమమైతే అప్పుడు రన్ రేట్ ఫ్యూచర్ ను డిసైడ్ చేస్తుంది. ప్రస్తుతం ఈ రన్ రేట్ విషయంలో టీమిండియా బాగా వెనుకబడింది.
ప్రస్తుతం గ్రూప్ 1 పాయింట్ల పట్టికలో వెస్టిండీస్ 5.35 రన్ రేట్ తో టాప్ ప్లేస్ లో ఉంది. విండీస్ ఇంకో మ్యాచ్ గెలిచినా సేఫ్ ప్లేస్ లో ఉండడమే కాదు సెమీస్ రేసులో ముందుంటుంది. సౌతాఫ్రికా 3.80 రన్ రేట్ తో రెండో స్థానంలో ఉండగా.. భారత్ -3.80 రన్ రేట్ తో మూడో ప్లేస్ లో ఉంది. భారత్ ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాలి. జింబాబ్వేతో చెన్నై వేదికగా ఫిబ్రవరి 26న తలపడనుండగా… మార్చి 1న వెస్టిండీస్ తో కోల్ కత్తాను ఢీకొంటుంది.

భారత జట్టు సెమీఫైనల్(India Semifinal) చేరాలంటే మొదట రెండు మ్యాచ్ లలోనూ మంచి రన్ రేట్ తో విజయాలు సాధించాలి. అదే సమయంలో విండీస్ ను సౌతాఫ్రికా ఓడించాలి. అలాగే జింబాబ్వే ను కూడా సౌతాఫ్రికా ఓడించాలి. అప్పుడే మన సెమీస్ అవకాశాలకు లైన్ క్లియర్ అవుతుంది.
ఇక్కడ మిగిలిన మ్యాచ్ ల ఫలితాలపై అనుమానాలు లేకున్నా దక్షిణాఫ్రికా జట్టు విండీస్ ను ఓడించగలదా అనేది ఆసక్తికరంగా మారింది. జింబాబ్వేపై కరేబియన్ బ్యాటర్ల విధ్వంసం చూసిన తర్వాత సఫారీలకు విండీస్ తో మ్యాచ్ అతిపెద్ద టాస్క్ గా చెప్పొచ్చు. మొత్తం మీద టీమిండియా తమకు మిగిలిన రెండు మ్యాచ్ లూ గెలవడమే కాదు మిగిలిన జట్ల సమీకరణాలు కలిసి వస్తేనే సెమీస్ చేరుతుంది.



