Donald Trump : అదే ట్రంప్.. అదే మాట
Donald Trump : ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ, గూగుల్( Google), మైక్రోసాఫ్ట్(Microsoft) వంటి టెక్ కంపెనీల 'గ్లోబలిస్ట్ మైండ్‌సెట్' సరికాదని విమర్శించారు

Donald Trump : అయినా మాట మారలేదు..అతని తీరు మారలేదు అంటూ అప్పట్లో వచ్చిన ఓ తెలుగు సినిమా పాట..అచ్చంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మైండ్ సెట్‌కు కరెక్టుగా సెట్ అవుతుందేమో. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. భారతీయ టెక్ నిపుణులపైన ఈసారి సూటిగా బాణం గురిపెట్టారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అగ్రశ్రేణి టెక్ సంస్థలు భారతీయులను ఉద్యోగాల్లో నియమించుకోవద్దని ఆయన మనసులో మాటలను బయట పెట్టేసారు.
Donald Trump
ఈ వ్యాఖ్యలు భారతీయుల పట్ల ట్రంప్‌నకు ఉన్న అక్కసును మరోసారి బహిర్గతం చేశాయని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీని ‘మిత్రుడు’ అంటూనే, మరోవైపు భారతీయులపై నిరంతరం విమర్శలు చేయడంతో ట్రంప్ తీరుపై భారతీయులు మండిపడుతున్నారు.
తాజాగా జరిగిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ, గూగుల్( Google), మైక్రోసాఫ్ట్(Microsoft) వంటి టెక్ కంపెనీల ‘గ్లోబలిస్ట్ మైండ్‌సెట్’ సరికాదని విమర్శించారు. ఈ సంస్థలు అమెరికన్ల అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని, దేశీయంగా ఉద్యోగాలు కల్పించడం మానేసి చైనాలో ఫ్యాక్టరీలు స్థాపించడం, భారతీయులకు ఉపాధి కల్పించడంపైనే దృష్టి పెడుతున్నాయని అన్నారు.
అమెరికన్ టెక్ కంపెనీలు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం, భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడం వంటివి ఇకపై జరగవని, తన పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయని ఆయన అల్టిమేటం జారీ చేశారు. AI రేసులో విజయం సాధించాలంటే సిలికాన్ వ్యాలీలో ‘సరికొత్త దేశభక్తి’ అవసరమని ట్రంప్ చెప్పుకొచ్చారు. టెక్ కంపెనీలు దేశీయంగా అవకాశాల కల్పనపైనే దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఫస్ట్ అమెరికన్స్ అనే నినాదంతో ట్రంప్ గత ఎన్నికలకు వెళ్లారు, అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా అదే నినాదంతో ముందుకు సాగారు. ఈ సమయంలోనే ట్రంప్ చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలపైనా, వాటి జాతీయులపైనా ఆయన నిరంతరం వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా భారతీయులపై ఆయన తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నారు.
ఒకవైపు నరేంద్ర మోదీని తన మిత్రుడు అని బహిరంగ సభల్లో ప్రశంసిస్తూనే, మరోవైపు భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేయడం డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రాజకీయ ఎత్తుగడలో భాగమా అనే సందేహాలను రేకెత్తిస్తోంది. స్వదేశంలో ఉద్యోగాలు కల్పించడంపై ఆయన దృష్టి సారించడం కరెక్టే అయినా..ఒక ప్రత్యేక దేశం లేదా జాతీయులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఇది కేవలం ఎన్నికల వ్యూహంలో భాగమా, లేక నిజంగానే భారతీయుల(Indians) పట్ల ఆయనకు వ్యతిరేక భావన ఉందా అన్నది చర్చనీయాంశంగా మారింది.