Maoists : మావోయిస్టుల అడుగులు..సిద్ధాంతాలు Vs లొంగుబాటు
Maoists : ఒకప్పుడు ఆయుధాల గలగలలతో దద్దరిల్లిన ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాలు ఇప్పుడు ఆకు రాలిన చప్పుడు కూడా వినిపించేంత నిశ్శబ్దంగా మారాయి.

Maoists : ఒకప్పుడు ఆయుధాల గలగలలతో దద్దరిల్లిన ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాలు ఇప్పుడు ఆకు రాలిన చప్పుడు కూడా వినిపించేంత నిశ్శబ్దంగా మారాయి. ఒకప్పుడు గట్టిగా నమ్మిన సిద్ధాంతాలను పక్కన పెడుతూ.. రక్తసిక్తమైన పోరాటాలకు ముగింపు పలికి, మావోయిస్టులు ఒక్కొక్కరుగా జనజీవన స్రవంతిలోకి తిరిగి వస్తున్నారు. తాజాగా, ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్, సుక్మా, బీజాపూర్, కాంకేర్ జిల్లాలకు చెందిన ఏకంగా 51 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోవడం హాట్ టాపిక్‌గా మారింది.
Maoists
ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లో మావోయిస్టులను అంతమొందించే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆపరేషన్ కగార్‌ను చేపట్టాయి. ‘ఈ ఆపరేషన్ పేరుకు తగ్గట్టుగానే, గత ఐదు నెలలుగా దండకారణ్యంలో వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులు భారీగా నష్టపోతున్నారు. ప్రతి ఎన్‌కౌంటర్‌లో పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణిస్తున్నారు. ఆపరేషన్ కగార్(Operation Kagaar) పేరుతో మావోయిస్టుల ఏరివేతలో పోలీసులు పైచేయి సాధిస్తున్నారు.
ఒకవైపు, తాము చర్చలకు సిద్ధం అంటూ మావోయిస్టులు పదే పదే లేఖలు రాస్తున్నా కూడా.. కేంద్రం మాత్రం వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదే పదే “మావోయిస్టులు లేని దేశంగా భారత్‌ను మారుస్తాం” అని ప్రకటించినట్లుగానే, వరుస ఎన్‌కౌంటర్లతో వారిని బెంబేలెత్తిస్తున్నారు. కీలక నేతలను కోల్పోయి, క్యాడర్‌లో నిరాశ అలుముకోవడంతో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న మావోయిస్టులు లొంగిపోవడమే మార్గంగా ఎంచుకుంటున్నారు.
తాజాగా బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ వెల్లడించిన వివరాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కఠినమైన చర్యలు, వ్యూహాత్మక ఆపరేషన్లతో మావోయిస్టుల కార్యకలాపాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. 2024 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఒక్క బీజాపూర్ జిల్లాలోనే జరిగిన ఎన్‌కౌంటర్లలో 185 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ గణాంకాలు ప్రభుత్వ ఉక్కుపాదం ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తున్నాయి.
అడవుల్లో అలుపెరుగని పోరాటాలు చేసిన వారు, ఇప్పుడు ఆ ఆయుధాలను వీడి లొంగిపోవడానికి చాలా కారణాలే ఉంటున్నాయి. ముఖ్యంగా వారి సిద్ధాంతం కన్నా, జీవితం విలువైనది అని గ్రహించడమే. దీనికి తోడు తీవ్రమైన ఒత్తిడి, అగ్ర నాయకుల మరణాలు, కనీస వసతులు లేని జీవనం, కుటుంబాలకు దూరం కావడం, భవిష్యత్తుపై అలుముకున్న నిరాశ వంటివి వారి నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. పదునైన ఆయుధాలు చేతిలో ఉన్నా కూడా.. అడవుల్లో నిత్యం మృత్యు భయంతో బతకడం వారిని శాంతి మార్గం వైపు నడిపిస్తోంది.
తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఆశ, కుటుంబ సభ్యులతో కలిసి జీవించాలనే కోరిక, సమాజంలో సాధారణ పౌరులుగా గుర్తింపు పొందాలనే తపన – ఇవన్నీ కూడా వారిని పోలీసుల ఎదుట నిలబెడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వం అందించే పునరావాస కార్యక్రమాలు, భవిష్యత్తుకు భరోసా, సాధారణ జీవితాన్ని గడిపే అవకాశం వంటివి వారి నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయని అంటున్నారు. చివరకు, తాము నమ్మిన విప్లవ సిద్ధాంతాలు వ్యక్తిగత జీవితాలపై వేసిన భారం, లొంగుబాటు వైపు వారిని నడిపిస్తున్నాయి.