Anvesh:ప్రపంచ యాత్రకు అన్వేష్ గుడ్ బై..ఇది ప్రజా సేవనా లేక సేఫ్ ఎగ్జిటా?
Anvesh: ప్రపంచ దేశాలు తిరగడం వల్ల తనకు డబ్బు వచ్చిందని, ఇక కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో తాను తప్పుకుంటున్నానని అన్వేష్ అన్నాడు.
Anvesh
తెలుగు యూట్యూబ్ రంగంలో ప్రపంచ యాత్రికుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యూ ట్యూబర్.. ‘నా అన్వేషణ’ అన్వేష్(Anvesh) అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజులుగా వివాదాల్లో చిక్కుకున్న ఆయన, ఇకపై తన ప్రపంచ యాత్రను ఆపేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఇప్పటివరకు 130 దేశాలు తిరిగానని చెప్పిన అన్వేష్(Anvesh).. ఇకపై మిగిలిన దేశాలను తన కోసం మాత్రమే చూస్తానని, వ్యూయర్స్ కోసం వీడియోలు చేయనని చెప్పాడు. అంతేకాకుండా, ఇప్పటివరకు తాను సంపాదించిన 8 కోట్ల రూపాయలను నిశ్చింతగా కూర్చుని ఖర్చు పెట్టుకుంటానని చెబుతూనే..ఇకపై ప్రజా సమస్యలపై పోరాడుతానని ఒక వీడియో విడుదల చేశాడు.
మొత్తంగా తన వీడియో ద్వారా తన సంపాదన వివరాలను కూడా బహిరంగంగా చెప్పిన అన్వేష్ .. అంటార్కిటికా యాత్ర చూపించినందుకు 20 లక్షలు, ఆర్కిటిక్ యాత్రకు 15 లక్షలు, అమెజాన్ అడవుల్లో చేసిన వీడియోలకు మరో 20 లక్షల రూపాయల వరకు వచ్చాయని ఆయన చెప్పుకొచ్చాడు. ఇలా ప్రపంచ దేశాలు తిరగడం వల్ల తనకు డబ్బు వచ్చిందని, ఇక కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో తాను తప్పుకుంటున్నానని అన్నాడు.

అయితే, ఈ ప్రకటన వెనుక ఉన్న అసలు కారణం ఇటీవల ఆయనపై వచ్చిన ట్రోలింగ్ , వివాదాలేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.యాత్రలు ఆపేసిన అన్వేష్ ఇప్పుడు సామాజిక కార్యకర్త అవతారం ఎత్తబోతుండటం సేఫ్ ఎగ్జిట్ అవడం అని కామెంట్లు పెడుతున్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ బాధితుల తరపున పోరాడుతానని, అలాగే మహిళా హక్కులు , రేప్ బాధితుల కోసం గళం ఎత్తుతానని హామీ ఇవ్వడం కూడా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు పరిస్థితి మారిందని కొందరు విమర్శిస్తున్నారు. వివాదాలు చుట్టుముట్టినప్పుడు ఇమేజ్ క్లీన్ చేసుకోవడానికే ఈ ప్రజా సేవ అనే కొత్త పల్లవి అందుకున్నాడనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అన్వేష్ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశం ఏదైనా సరే..ఇప్పటివరకూ 130 దేశాల అనుభవాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి వాడితే అది మంచి పరిణామమే. కానీ, ఎనిమిది కోట్లు ఉన్నాయి కదా అని కూర్చుని తింటే ఆ సంపద కరిగిపోవడానికి ఎంతో సమయం పట్టదన్న విషయం అన్వేష్ తెలుసుకోవాలి. కొత్తగా వచ్చే యాత్రికులకు అన్వేష్ సలహా ఇస్తూ ధైర్యే సాహసే లక్ష్మి అని చెప్పడం మెచ్చుకోదగ్గ విషయమే. ఈ ప్రపంచ యాత్రికుడు ప్రజా యాత్రికుడిగా ఎంతవరకు సఫలం అవుతాడో చూడాలి మరి.



