Sea level:పెరుగుతున్న సముద్ర మట్టాలు.. తీవ్ర ముప్పులో భారత్‌లోని ఆ ప్రాంతాలు
Sea level: ఈ పెరుగుదల మానవ చర్యల వల్లే వచ్చిందని 95% పైగా శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి.

Sea level
మూడు దశాబ్దాలుగా మన భూమి అనూహ్యమైన మార్పులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా, ప్రపంచ సముద్ర మట్టం(Sea level) 1993 నుంచి ఇప్పటి వరకు చరిత్రలో ఎన్నడూ లేని వేగంతో పెరుగుతోంది. నాసా, నోవా , ఇతర శాస్త్రీయ సంస్థల విశ్లేషణ ప్రకారం, ఈ ముప్ఫై ఏళ్లలో సముద్ర మట్టం(Sea level) 101.4 మి.మీ అంటే దాదాపు 10 సెం.మీ పెరిగింది. ఇది కేవలం ఒక సంఖ్య కాదు, మన భవిష్యత్తుకు ముంచుకొస్తున్న పెను ప్రమాదానికి ఒక సంకేతం అని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పెరుగుదల మానవ చర్యల వల్లే వచ్చిందని 95% పైగా శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి.
ప్రపంచ సముద్ర మట్టం (Sea level)ఇంత వేగంగా పెరగడానికి మూడు ముఖ్య కారణాలు ఉన్నాయి. దీనిలో మొదటిది భూతాపం (గ్లోబల్ వార్మింగ్). వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ వంటి గ్రీన్ హౌస్ వాయువులు పెరిగి, సూర్యుని వేడి భూమిపై నిలిచిపోతోంది. ఈ వేడి వల్ల సముద్రపు నీరు వేడెక్కుతోంది. వేడెక్కిన నీరు వ్యాకోచించడం (Thermal Expansion) వల్ల దాని పరిమాణం పెరిగి, సముద్ర మట్టం పెరుగుతోంది. ఈ ఒక్క కారణమే సముద్ర మట్టం పెరుగుదలలో దాదాపు సగం వాటాను కలిగి ఉంది.
ఇక రెండోది మంచు కరగడం. గ్రీన్‌ల్యాండ్, అంటార్కిటికా, హిమాలయాల వంటి పర్వత ప్రాంతాల్లోని మంచు గ్లేసియర్‌లు మరియు మంచు పర్వతాలు ఊహించని వేగంతో కరిగిపోతున్నాయి. ఈ కరిగిన నీరు భారీగా సముద్రంలో కలుస్తోంది. ప్రత్యేకించి, 2010-18 మధ్య కాలంలో ఈ మంచు కరుగుదల మూడు రెట్లు పెరిగిందని రికార్డులు చెబుతున్నాయి.

మూడోది అలాగే అతి ముఖ్యమైనది భూగర్భజలాల వాడకం. మానవులు వ్యవసాయం, పరిశ్రమలు, ఇతర అవసరాల కోసం భూగర్భజలాలను విపరీతంగా తోడుకుంటున్నారు. ఈ నీరు చివరికి నదుల ద్వారా సముద్రంలోకి చేరడం కూడా సముద్ర మట్టం పెరగడానికి ఒక కారణం. ఇది చిన్న వాటా అయినా, దీని ప్రభావం వ్యూహాత్మకమైనది.
సముద్ర మట్టం పెరుగుదల రేటు 1993లో సంవత్సరానికి 2.1 మి.మీ ఉండగా, 2023 నాటికి అది 4.5 మి.మీకు పెరిగింది. ఇదే వేగంతో కొనసాగితే, 2050 నాటికి సముద్ర మట్టం మరో 169 మి.మీ అంటే దాదాపు 17 సెం.మీ పెరిగే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావం అమెరికా, యూరప్, ఆసియాలోని తీర ప్రాంతాలపై తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా భారతదేశంలోని కృష్ణా, గోదావరి డెల్టాలు, సుందర్‌బన్స్, గంగా డెల్టా వంటి ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది.
గ్రామాలు, పట్టణాల ముంపునకు గురయ్యి.. కోట్లాది మంది ప్రజలు నివసించే తీర ప్రాంతాలు మునిగిపోతాయి. దీనివల్ల ఆర్థిక, సామాజిక నష్టాలు భారీగా ఉంటాయి.ఉప్పు నీటి సమస్య ఎదురవుతుంది. ఎలా అంటే సముద్రపు నీరు భూగర్భజలాల్లోకి చేరి, తాగునీటికి, వ్యవసాయానికి పనికిరాకుండా పోతుంది. అలాగే తీరప్రాంతాల్లో ఉన్న రోడ్లు, భవనాలు, పర్యాటక ప్రదేశాలు, పరిశ్రమలు పూర్తిగా దెబ్బతింటాయి.

అయితే దీనికి కొన్నిపరిష్కార మార్గాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా చర్యలు తీసుకోవడం చాలా అవసరం.పెట్రోల్, డీజిల్, బొగ్గు వినియోగాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహించడం.
తీర ప్రాంతాల పరిరక్షణ కోసం.. వేవ్ బ్రేకర్‌లు నిర్మించడం, మడ అడవులను పెంచడం, తీర ప్రాంతాలను రక్షించడం.అలాగే మన జీవనశైలిలో మార్పులు రావాలి. మనం వాడే నీటిని తగ్గించడం, పునరుపయోగించడం వంటివి అలవాటు చేసుకోవాలి.
Also Read: Baba Vanga:బాబా వంగా జోస్యం..ఈ ఆగస్టులో డబుల్ ఫైర్‌తో ప్రపంచం నాశనం తప్పదా?